
జగదేక వీరుని కథ – పేరే చెపుతుంది జానపద చిత్రమని.
ఒక వీరుడూ అతని భార్యలు నలుగురూ – సరే ఒక వాక్యంలో కథ కూడా చెప్తుంది ఫాంటసీ అని. అందుకే దానిలో మనుషులు రాళ్లయి పోతారా, ఒకరు నాలుగు రూపాల్లో మారగలరా అనే ప్రశ్నలు వేసుకోకుండా బుద్ధిగా అందులోని హాస్యాన్నీ, పరమాద్భుతమైన సంగీతాన్నీఆస్వాదించడానికి (వెయ్యో సారి) సిద్ధం అయ్యాను.
కథని టూకీగా కూడా ఎవ్వరికీ చెప్పే సాహసం చెయ్యను. తెలియని వాళ్ళుంటారనుకోను. ఒకవేళ ఎవరికైనా తెలియకున్నా మరేం పర్వాలేదు.
తన వదినగారికి రక్షణగా ఉంటాడు రేలంగి. ఆమెను వంచించేటందుకు దుష్ట రాజూ, అతని కుటిల మంత్రీ ఆడవేషాల్లో వస్తారు. రేలంగి వారి దురూహ తెలుసుకుని … వారికి ‘తగిన విధం’గా శాస్తి చెయ్యాలనుకుంటాడు.
ఆ ప్రయత్నంలో రాజభటుల్నిద్దరిని పూటుగా తాగి రమ్మని చెప్తాడు. ఇదుగో ఆ సంభాషణ:
రేలంగి: ఏరా బాగా పుచ్చుకున్నారా?
ఒక భటుడు: పీకల దాకా పుచ్చుకున్నామయ్యా! ఏరా నీకెట్టా ఉంది?
రెండో భటుడు: సొరగం లో సొరగం రా, ఇపుడో పిల్ల … పిల్ల దొరికితే నా సామీ రంగా!
రేలంగి: ఒరేయ్ ఇప్పుడిక్కడికీ ఇద్దరు కొత్త దాసీ లొచ్చారు (బాగా బలంగా ఉండే వాళ్ళని … మోచేతుల్నిఎత్తి ఊపుతూ సూచిస్తాడు) చూసేరా?
భటులు: చూసేమయ్యా,
రేలంగి: చూసేరుగా … ఊ … వెళ్ళేటప్పుడూ వాళ్ళిద్దరినీ చెరోళూ లంకించుకోండి.
వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై అతని కాళ్ళ మీద పడతారు … ఆ కానీండి కానీండి … అంటూ రేలంగి నిష్క్రమిస్తాడు. ఈ ‘హాస్యం’ ఇంతటితో పూర్తి కాదు. ఇంకా ఉంది.
ఆడా కాదు మగా కాదు, మా లోకం లో పేడి వారన్న జాతి ఉన్నారంటూ ఒక విసురు తో ‘హాస్యం’ పండించేక వారిని బయటకి పంపిస్తాడు. బయట కాసుకుని ఉన్న భటులు ఆడ వేషంలో ఉన్న రాజూ, మంత్రిల … మీద పడతారు. తాగి ఉన్నవారు వీరినే విధంగా బాధించి ఉంటారో ఊహించుకున్న వారికి ఊహించుకున్నంత ‘హాస్యం’!
ఇంతటితో అయిపోయిందనుకున్నారా? అమ్మమ్మ! అసలు విషయం ఇక్కడే ఉంది. అది విన్నది విన్నట్టూ రాస్తాను. ఎంత రసవత్తరమైన హాస్యమో మీరే తేల్చుకోండి.
రాజు: ప్రగ్గడా, తెలిసిపోయింది. ఇక ఈ చచ్చు సరసాలెందుకు? ఆడదాన్ని చేపట్టే ఒడుపు తెలిసిపోయింది.
మంత్రి: అదెప్పుడు తెలిసింది రాజన్?
రాజు: అదే ఆ భటుడు మా జబ్బ పట్టుకున్నపుడు. మేం మగవాళ్ళం అయ్యాం గనక సరిపోయింది గానీ అదే ఆడ దాన్నయ్యుంటే ఆ పట్టుకు ఆట్టే లొంగి పోయేదాన్ని. ఒడుపంటే అది. నీకు తెలీలేదు.
మంత్రి: ఆ … నాకు తెలీలేదంటే నన్ను పట్టుకున్నవాడు ఒట్టి చచ్చు వెంకయ్య!
రాజు: హహహ!
దీని గురించి ఏ వ్యాఖ్యానమూ చెయ్య దల్చుకోలేదు. ఒక్కొక్క తప్పునూ ఎత్తి చూపి రాసి మీ వివేకాన్ని అవమానించ దలుచుకోలేదు. నేను చెప్పకపోయినా మీకు దానిలోని లోపాలన్నీ తెలుస్తూనే ఉండి ఉంటాయి. మరి దేనికి ఇదంతా వివరంగా రాసేనంటారా? కారణముంది.
ఎప్పుడో 1961లో వాళ్ళ ఆలోచనలు అంతే ఉండేవి, ఆ చిత్రాల్లో ఉన్న ‘కళ’ను ఆస్వాదించడమే గానీ ఈనాటి దృష్టితో వాటిని శల్య పరీక్ష చెయ్యకూడదు అని కొందరంటారు. నాకు తెలుసు.
వారికి నేను చెప్పేది ఒకటే! ఈ తప్పుల్ని తప్పులూ అని గుర్తించి పోరాడేం గనకనే అలాటి సంభాషణలు ఈనాడు అంత ఓపెన్ గా మనకు వినపడడం లేదు (కనీసం సినీమాల్లో). లేకపోతె ఈనాటికీ బలత్కారాన్ని శిక్షగా విధించడం, ఆ ప్రయత్నాన్ని చూసి నవ్వుకోవడం, తాగించి ఉసిగొల్పడం, జెండర్ ని అవమానం చెయ్యడం, బలవంతం చేసేవాడి ఒడుపును చూసి ఆడవాళ్ళు మురిసి పోతారనుకోడం … ఇంకా అంత విచ్చలవిడి గానూ జరుగుతాయి.
మళ్ళీ మాట్లాడితే … అవి తప్పు అని చెప్పడానికి కూడా మనం భయ పడాల్సి రావచ్చును.
అందుకే శివశంకరీ పాటతో తన్మయురాలి నైనా, మరేవేవో మధుర స్మృతులు ఆ సినీమాతో ముడి పడి ఉన్నా …తప్పును తప్పూ అని వేలెత్తి చూపించాల్సిందే. లేదంటే ఎప్పుడు అడుగు వెనక్కి పడి పోతుందో ఎవరూ చెప్పలేరు.
… … … తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు అని సుమతీశతక కారుడు చెప్పినా నేను మాత్రం ఆ పని చెయ్యదల్చుకోలేదు.
నేను కూడా తప్పించుకోదలుచుకో లేదు కళ్యాణి గారూ! ఇదివరకటి సినిమాల్లో ఘోరమైన నైతిక నాణ్యతా ప్రమాణాలుండేవి. “శీలం” (?) కోల్పోయిన స్త్రీ సినిమాలో ఎలాగైనా సరే చనిపోవాల్సిందే. దాన్ని పోగొట్టిన సత్యనారాయణో, రాజనాలో, చలపతిరావో – వాడి క్షేమాన్ని కూడా కాంక్షిస్తుడేదామె వాడు చివర్లో పశ్చాత్తాపపడే వరకు. పాతసినిమాల్లో విలువలు విలువలే కాదు అదో అమానవీయ భ్రష్టృత్వం. ఆ సంగీత సాహిత్యాలకోసం కూడా ఆ సినిమాల్ని క్షమించకూడదు. ఆడియో వింటే చాలు. ఐతే వీటికి మాయాబజార్, మిస్సమ్మ వంటివి మాత్రం మినహాయింపు.
LikeLike
జగదేక వీరుని కథలో మంచి పాటలు వున్నాయి. కానీఅదోచెత్తకథతో, విలువలతోనిండిన సినిమా. నలుగురుస్త్రీలసాంగత్యాన్ని ఏకకాలంలో కోరిన పురుషుడు కథానాయకుడు. ఆహీరో కన్నా తండ్రి కొంచం వాల్యూస్ కలవాడు. కొడుక్కి మంచి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తాడు. దురదృష్టం, ఇప్పటికీ ఒక హీరో వెనక ఎంతఎక్కువమంది స్త్రీలు (ఏమాత్రం self respect లేకండా)పడితే వాడంత గొప్ప వాడిగా చూబిస్తూనే వున్నారు. చూసేవాళ్ళుచూస్తూనే వున్నారు.
LikeLike
ఔను కృష్ణజ్యోతిగారూ, కథ పోనీ జానపదం, రాజుల కథ అని సరి పెట్టుకోవాలనుకున్నా …పంటి కింద రాళ్ళ లాంటి విషయాలున్నాయి. వాటిని చర్చించు కోక పొతే ప్రమాదం అనిపించింది.
LikeLike
మీ విశ్లేషణ బాగుంది. కానీ యాభై ఏళ్లు దాటిన సినిమా ని ఈనాటి ప్రమాణాలులతో పోల్చడం నాకైతే సబబనిపించడం లేదు. పాత సినిమాలో పాటలు మాత్రం వింటాం. ఈ తరం పిల్లలెవరూ ఆ సినిమా లను చూడరు. పైగా ఇంత సాధించామనుకొంటున్న ఈ రోజుల్లోనే నూటికి తొంభై సినిమాల్లో ఆడదాని పాత్ర అందాల ఆరబోతకే పరిమితం. అటువంటప్పుడు వాటిని ఇంతగా చీల్చి చెండాడనక్కరలేదేమోనండీ. వాటికి ఆనాటి సమాజపు ఆమోద ముద్ర ఉంది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. పైగా ఇలా విశ్లేషిస్తూ పోతే కొన్ని గొప్ప చిత్రాలు రచనలు కూడా తేలిపోతాయి.
LikeLike
ఔనండీ, పద్మశ్రీ గారూ! మీరు చాలా మంచి పాయింట్ చెప్పేరు.
ఆ విషయాలకు ఆనాటి సమాజపు ఆమోదముద్ర ఉంది. కనుక ఈనాడు మనం ‘వాటికి’ మాత్రం మన అభ్యంతర ముద్ర వేద్దాం… తక్కిన ఆమోదయోగ్యమైన వన్నిటినీ ఆదరిద్దాం.
LikeLike
అనాటి సమాజం వాటికి ఆమోద ముద్ర వెయ్యడం ఆనాటి సమాజపు అపరిపక్వతకు, అప్పటి అమానవీయ ధోరణులకు నిదర్శనం. నైతికతకూడా పరిణామం చెందుతూనే ఉంటుంది. ఉండాలికూడా. ఒకప్పుడు సాగాయని సతి లాంటి ఆచారాలకి, అంటరానితనం లాంటి ఘోరాలను నేను గౌరవించలేను. కనీసం చూడనట్లుకూడా ఉండలేను.
చరిత్ర అనేది పూజించడానికికాదు. జరిగిన తప్పులను విశ్లేషించి అంతకంటే మెరుగైన జీవితాలను సాకారంచేసుకోవడానికి.
LikeLike