రాజుల/నాయకుల నిజాలు

బాహుబలి సినీమా చూసేను. ఆ సినీమా కథా, టేకింగూ, కళా, విలువలూ – ఈ మంచీ చెడ్డా జోలికస్సలు పోను.  ఈ పోస్ట్ సినిమా గురించి కాదు – సినిమాలో బయటపడ్డ వాటి గురించి.  నాకు ఆ సినిమాలో కనిపించిన అంశాలు … ఆ సినిమా తయారీ దారులు ఉద్దేశించినవి కానే కాదు, నూటికి నూరు శాతమూ కాదు.

సినిమా అభిమానులు/ ఔత్సాహికులు – ఎవరైనా చదవబోతున్నారేమో, కంగారు పడకండి. నేను కథకి సంబంధించిన సస్పెన్సును బయటపెట్టే పనులేం చెయ్యబోను. ప్రశాంతంగా చదవొచ్చు మీరు.

రాజుల బలం –  అతని వీరత్వం మీదా లేక అతని దగ్గరున్న వీరుల శౌర్య సాహసాల మీదా ఆధారపడి ఉంటుందని మనకు కథలు చెప్తూ ఉంటారు. ఆ రాజ్యపు సహజసంపదల మీదా, రక్షణల మీదా, కాపలాల మీదా ఉందని చెప్తారు. వేగుల వాళ్ల సమాచారాల మీదా, మంత్రుల తెలివి తేటల మీదా, దూతల చాకచక్యం మీదా రాజకీయపు టెత్తుల మీదా ఆధార పడుతుందంటారు.  చివరికి చారులూ, రాజనర్తకి, గాయకులూ, కవులూ, విదూషకులూ, పురోహితులూ కూడా ఆ జాబితాలో భాగమే. అందరూ –  అడపా దడపా వచ్చిన ఆపదల్లోంచి తమ శక్తి యుక్తులనుపయోగించి తమ రాజ్యాలని అమాంతం గట్టెక్కించిన వైనాలు … చిన్నప్పట్నుంచీ వింటూ ఉంటాం. ఆ కథలు విశ్వ సాహిత్యం లో కూడా కోకొల్లలు. అవి ఎంతో కొంత మేరకు నిజమూ కావచ్చు – ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో! వాటిని తర్కించే అవసరం లేదు. మన మనోల్లాసానికి ఎన్ని కథలన్నా చెప్పుకోవొచ్చు.

అయితే అలాటి కథలన్నిటికీ ఉమ్మడి అంశం ఒకటి – ఆహా, రాజు గారికి ఇలాటి వాడొక్కడుంటే …ఇంకేం అక్కర్లేదు అనిపించడం.

కానీ కొంచెం రీజనింగుండి, తగు మాత్రం ప్రజల ఎమోషన్లతో పరిచయం ఉన్నవాడెవడైనా – టక్కున చెప్పగలడు. రాజులు కావాలి కావాలని  ఆశపడేదిీ, అర్రులు చాచేదీ – ప్రజాదరణ కోసమేనని.  సరే దానిని పొందడం కోసం ప్రజలకు మేలు కలిగే పనులు చేసి, వారి అభిమానం పొందాలని అనుకునేంత వెర్రి రాజులుంటారా, ఉండరు. ఒక వేళ ఉంటే, గింటే ఏం జరుగుతుందంటే, ఏ ధనవంతుల కోసం అసలు రాజ్యం ఏర్పడిందో వాళ్లు ఆ రాజు చెవి మెలేసి బుద్ధి చెప్తారు, లేకపోతే అవతలికి పొమ్మంటారు. అసలలాటి అవసరం ఇన్ని శతాబ్దాల్లో ఒక్క సారైనా వచ్చి ఉంటుందో లేదో … మరి నాకు తెలీదు.

సరే! ప్రజల చేత జేజేలు ఎలా  కొట్టించు కోవాలి?  వారిలో పరపతి ఎలా పెంచుకోవాలి? మరి అప్పుడే కదా తమ అధికారం సుస్థిరం అయ్యేది,  ఆ స్థానం ఎలా దక్కించుకోడం? అదే కదా అందరు నాయకుల తాపత్రయమూనూ! రాజ్యతంత్రమంటే ఏమిటయ్యా అంటే … ఏ మేజిక్కో గిమ్మిక్కో చేసి ప్రజలని మైమరిపించడం. అందుకే క్రతువు లండం, యజ్ఞాలండం, పూజలండం, బలులండం – ఇవన్నీ రాజ్యం సుభిక్షంగా ఉండడానికే చేస్తున్నామనడం.    baahubali-2-stills-photos-pictures-262
“మాకు ప్రజల క్షేమమే ముఖ్యం. మీ కోసం రాణీ గారు చూడండి … పాపం…  ఒట్టి కాళ్లతో నెత్తి మీద నిప్పుల్తో అంత దూరం సంవత్సరానికోసారి నడిచి వచ్చి కరువు రాక్షసిని కాల్చేస్తోందం”టే …( బొత్తి గా సినిమానొదిలేసి రాస్తున్నాననుకోకండి మరి ) ప్రజల్లో ఎలాటి సెంటిమెంటు లేస్తుంది? వాళ్ళ మనసులుప్పొంగి పోవా!!!  – అదీ టెక్నిక్. అది వాల్మీకికీ తెలుసు, వ్యాసుడికీ తెలుసు … మొన్న మొన్నటి చాణుక్యుడికీ తెలుసు. దేశకాలాలను దాటి వచ్చిన తెలివి అది.  గురజాడ కన్యాశుల్కంలో రాస్తాడు  – ‘సీవఁరాణి బీద సాదలకి బట్టలు కుట్టి ఇస్తుంద’ని గిరీశం డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఊక దంపుడు గుర్తుంది కదా. ఇంగ్లండు నుండి ఇక్కడి దాకా పాకించి తెచ్చిన  కథల మహిమ తక్కువా!

అటు కైకేయికీ, ఇటు ధృతరాష్ట్రుడికీ ఆవరాసుకు పోయినట్టు మండడానికి కారణం ఏమిటి?

ప్రజలు రాముడి వైపో, ధర్మరాజు వైపో మొగ్గేరన్నది – కథకి ఇరుసు. అదే మేజర్ ప్లాటు. రాముడు వనవాసానికి పోతుంటే ప్రజలు భోరు మన్నారట. పాండవుల వెంట పడి అడవుల్లోకి పోయార్ట. “అయ్యలారా! అమ్మ లారా! వాడు రాజైతే   మన కెందుకు? వీడు రాజైతే మన కేమిటి? ఏ రాయైతేనేం పళ్లూడగొట్టు కోడానికి? మనకి  కావలసిన కూడూ గూడూ మనకు దక్కేట్టు చూసుకోడం ముఖ్యం  కదర్రా ” అని మీలాటి నాలాటి వాళ్లు ఆ అమాయకులికి చెబ్దామన్నా ….ఇప్పుడూ వినడం లేదు, అప్పుడూ వినుండే వారు కాదు. ఆ  సెంటిమెంట్  మాయాజాలం అలా ఉంటుంది మరి. దానిని ఛేదించి వాళ్ళ దాకా నిజాన్ని పట్టికెళ్ళడం – అదేం తేలికకాదు.      aaeaaqaaaaaaaaymaaaajge5zgq5zdaylwrjodetndjjni1iowrhlwmwotninweymzjhna

భారతీయ సాహిత్యమే కాదు,  ప్రపంచంలోని ఏ సాహిత్యం తీసుకున్నా ఇదే సత్యం బయటపడుతుంది. అంతెందుకు ఏసుక్రీస్తును రోమన్ రాజులు చంపించింది అతనికి పెరిగి పోతున్న ప్రజాదరణని చూసే కదా. తర్వాత కాలంలో మేకవిల్లీని అపర చాణక్యుడని చెప్పొచ్చు. అతను రాజులకి చిట్కాలుచెప్తూ ప్రిన్స్ అని పుస్తకం రాసేడు. దాని నిండా ఇవే … ఎలా అసలు పని చెయ్యకుండా చేసినట్టు కనిపిస్తూ ప్రజల మెప్పు పొందాలో … ఆ జిత్తులన్నీ నేర్పుతాడు.

అనుకోకుండా సినిమాలో  బయట పడిన మరొ పదహారణాల సత్యం – రాజుల్ని రాజ భవనాల్లోంచి బయటకి లాగి సామాన్యుల మధ్య బతికేటట్టు గనకా చేసామా – వాళ్ల భుజ బలాలూ, విద్యాభ్యాసాలూ … ఎలా ఉపయోగించాలో, ఎవరికి మేలు చెయ్యాలో … మహ చక్కగా బోధపడుతుందని!

భలే ముచ్చటేసింది లెండి ఆ ఆలోచనకే.

ప్రజాదరణ అంటే అంతటి విలువైన సరుకు. పోనీ దాని బలం అర్ధమయ్యాకైనా … ప్రజల అభిమతానికి లొంగి ఉంటారా మరి ఈ రాజులు. అబ్బే, అదేం లేదు, దానిని ఎలా మేనిప్యులేట్ చెయ్యాలా అని తలలు పగల గొట్టుకుంటూ ఉంటారు. ఆ భాగ్యాన్ని దక్కించుకున్నవాడు పక్కలో బల్లెం లా కనిపిస్తాడు. అది ఫిడల్ కాస్ట్రో గానీ, సద్దాం హుస్సేన్ కానీ – వాడి వ్యక్తిగత గుణగణాలతో సంబంధం లేదు. వాడు ప్రజల్లో పాపులరా – అయితే దించేయ్ లేక పోతే చంపించేయ్. అదే పోలిటిక్స్ సారమంతా.

అది బహిరంగంగా  మాత్రం జరగకూడగదు, జరిగిందా – ప్రజలకి ఆగ్రహం వచ్చేస్తుంది. అంతర్యుద్ధం వచ్చేయ్యగలదు. మహర్షులూ, ఆచార్యులూ, మన సినిమాల్లో ధర్మపన్నాలు చెప్పే రాణీ గార్లూ  – అలాటి అత్యవసర పరిస్థితుల్లో …తూచ్ అనీ, టైం ప్లీస్ అనీ – బ్రేక్ తీసుకుంటారు. చిన్న చిన్న హత్యలు చేసో, చేయించో, (అదీ  రహస్యంగా  సుమా) –  వచ్చి  మళ్లీ రాజ్య రక్షణా  భారం వహిస్తారు.

మరి,  ‘ధర్మ పరిపాలన’  చెయ్యాలంటే, అసలు పరిపాలన అంటూ సాగాలా వద్దా?  దానికి సిద్ధంగా ప్రజలుంటేనే కదా పరిపాలన చేసేది ….

ఎంత బంగారం సింహాసనం అయినా అది రాజ్యాధికారానికే కదా చిహ్నం. అసలు ఆ అధికారం అన్నది ఉండాలంటే …  అమాయక ప్రజలకు కోపం రానంత సేపే. ఆ విషయం  రాజ్యం చేసే ప్రతీ వాడికీ వాడి అంతరాంతరాల్లో తెలుసు. –

 

తెలీనిది ప్రజలకి మాత్రమే.- అదీ కథ

 

 

 

 

అందరూ ‘దంగల్ ‘ చేయించే తండ్రులవ్వచ్చా?

పోటీలకోసం కాదు, పిల్లల పురోభివృద్ది కోణంలో ఆలోచిద్దాం.

దంగల్ సినీమా ముఖ్యోద్దేశం – క్రీడల పట్ల అనురక్తీ, దేశం కోసం ఆడాలన్నపట్టుదలా, దీక్షా దక్షతల సాఫల్యం – ఇలాటి భావాల్లో ఏదో ఒకటి గానో లేకపోతే అన్నీఅనో చాలా మంది రాసేరు. ఆ విషయాలతో అస్సలు సంబంధం లేని ప్రశ్నల్ని చర్చించాలని ఉంది. ఇంకో సినీమా ఏదీ రేకెత్తించని ప్రశ్నల్ని అది నాలో లేవనెత్తింది. ఒక్కో  *అంశం చెప్పి దానిపై నా స్పందన చెప్తాను. ఆ క్రమంలో అభినందించాల్సిన అంశాలూ, సవరించుకుంటే బాగుండుననిపించిన అంశాలూ ప్రస్తావనకు వస్తాయి కనక వాటిని సావధానంగా పరిశీలించమని నా మనవి.

ముందుగా సినీమాలో పదిమందీ ఒప్పుకున్న ఘనత ఏమిటో టూకీగా ఓమాట చెప్పుకుందాం.

*కుస్తీల్లో నేషనల్ లెవెల్ ఆటగాడు మహావీర్ సింగ్ పోగట్. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించినా – జీవిక కోసం ఉద్యోగం చెయ్యక తప్పదు కనక జీవితంతో రాజీ పడి కుస్తీకి దూరమౌతాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పతకం తేవాలన్న తన కోరికని తనకు పుట్టబోయే కొడుకు తీరుస్తాడని కలలు కంటూ ఉంటాడు. కొడుకు పుట్టడు కానీ ఆ క్రమంలో నలుగురు కూతుళ్ళకు తండ్రి ఔతాడు. పెద్ద కూతుళ్ళు గీత, బబిత ఇద్దరిలోనూ కుస్తీ చెయ్యగల నేర్పు ఉన్నదని తెలుసుకుంటాడు. ఆ నమ్మకంతో కృషి చేస్తాడు. 

హర్యానా రాష్ట్రం గానీ, కుస్తీ ఆట గానీ మగాళ్ళ ప్రాబల్యం బలంగా ఉన్న జాగాలు. అక్కడ, అదీ ఓ పల్లెటూరిలో, ఒక మధ్య తరగతి తండ్రి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ తన నలుగురు ఆడపిల్లలకీ పెళ్ళిళ్ళు చేసి సాగనంపెయ్యాలనుకోకుండా – వారిలో ఒక ప్రతిభ ఉందని గుర్తించడం, వారిని గురించి ఒక ‘కల’ కనగలగడం, దాని కోసం పరిశ్రమించాలని అనుకోవడం – ఇవన్నీ- జయాపజయాలతో సంబంధం లేకుండా – చాలా సంతొషించదగ్గ విషయాలు. సరే, కామన్ వెల్త్ లో అమ్మాయి గీత  గోల్డ్ నిజంగా గెలిచింది  కాబట్టి సినీమా కథగా మారింది కానీ మన చర్చకి దానితో సంబంధం ఉండనక్కరలేదు. ఎందుకంటే – ‘పిల్ల లందరికీ’ సంబంధించే విషయం ఏదన్నా ఉందా అని మాట్లాడుకోవాలని నా ప్రయత్నం.

*ప్రతీ రోజూ పిల్లలిద్దర్నీ చీకట్నే లేపి ఎన్నో గంటల వ్యాయామం చేయించి, వాళ్ళు వేసుకునే దుస్తుల్లోనూ, వాళ్ళు తినే తిండిలోనూ జోక్యం చేసుకుని, చివరికి వాళ్ళ జుట్టును కూడా కత్తిరింపించి వాళ్లను అందరు ఆడపిల్లల కంటే భిన్నంగా పెంచుతాడు. తోటి పిల్లలతో వినోదాలకు కూడా దూరం చేసి వాళ్ళను పహిల్వానులను  చేస్తాడు.  

అంత చిన్న పిల్లల్ని ఏ అధికారంతో కుస్తీలు పట్టాలని శాసించాడు ఆ తండ్రి, అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. జవాబుగా వారికి మంచి భవిష్యత్తు రూపొందించాడు కదా అనొచ్చు. అలా చూస్తె ఐఐటి కోచింగ్లంటూ పిల్లల్ని ముక్కూ మూతీ కట్టి టెక్నోస్కూళ్ళ నూతుల్లో తోసేస్తున్న తల్లిదండ్రులంతా ఆ అమీర్ ఖాన్లే అనుకోవాలి, మరి పాపం వాళ్ళ ‘బంగారు’ భవిష్యత్తు కోసమేగా వాళ్ళను ఆ కష్టాలు పెట్టేది. మరి పిల్లల విషయంలో లోకంలో జరుగుతున్నదంతా సమంజసమైనదేనా?

అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది ఇక్కడ – చాలా మౌలికమైన భేదం. అదేమిటంటే – పిల్లల్లో ఆ ‘ప్రత్యేకమైన’ ప్రతిభను చూసి దానికి దోహదం చెయ్యడానికి తన శక్తియుక్తుల్ని ధార పోసేడు ఆ తండ్రి. అంతే కానీ లక్షలమంది అదే నూతిలో పడుతున్నారు గనక మేమూ మా పిల్లల్ని ఆ నూతిలోనే తోస్తాం అన్నమూర్ఖత్వం కాదు అది. సినీమాలో లోపం లేకపోలేదు. పిల్లలు – తమకు దొరికిన అవకాశం విలువను వాళ్ళే గుర్తించినట్టూ, వారి సమ్మతీ సహకారాలతో తండ్రి వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్టూ –  చిత్రీకరించి ఉంటే బాగుండేది, కానీ అది వేరే చర్చ.

కావాలని చెప్పేరో లేక అంత ఊహించలేదో తెలీదు గానీ – *క్రీడాకారులను బలహీన పరుస్తాయి అని అనుకునే అన్ని విషయాలనూ తన కూతుళ్ళకు నిషిద్ధం చేస్తాడు తండ్రి. ఆడతనం నిలుపు కోవడమో, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని దిశగా జీవితాన్ని నడుపుకోవడమో  ఏదో ఒకటే సాధ్యం అన్నట్టు చూపించారు.

ఆ లెక్కన ఈ అలంకరణలూ, ఆకర్షణ కోసం ఆరాటాలూ, జిహ్వ చాపల్యాలూ  – పిల్లల క్రియా శీలతనీ, పురోభివృద్ధినీ అడ్డుకుంటాయని ఒప్పుకున్నట్టే కదా. పెద్దయి జాలీగా గడపడం అనేదే తప్ప మరే లక్ష్యమూ లేకుండా పిల్లలు పెరుగుతున్నారన్నది అబద్ధం కాదు. అందులోనూ ఆడపిల్లలకి ఆడపిల్లలుగా కనిపించడం అనే అదనపు భారం  ఒకటి. సినీమా లోని ఈ కోణం చూసాక – అటువంటి  పై పై మెరుగుల మీద మోజు పెంచి, వారి మనసులను చిక్కుల్లో  ఇరికించి పిల్లల జీవితాలను నిర్వీర్యం చేస్తున్నామే అని అనిపించక మానదు.

కుస్తీ పట్టాలంటే కావాల్సిన నిగ్రహం, క్రమశిక్షణా మిగిలిన రంగాల్లో రాణించాలంటే అక్కరలేదా… తప్పకుండా కావాలి. తినే తిండి, పాల్గొనే వినోదాలూ, కోరుకునే కోరికలూ – అన్నిటి ప్రభావమూ పిల్లల అభివృద్ది మీద ఉంటుంది. వాటిని చక్కదిద్దకుండా పిల్లలకు లక్ష్యశుద్ధి ఏర్పడాలనే ఆశ నిరర్ధకం.

అలా అని పిల్లల్ని మిలిటరీలో పెట్టినట్టు పెంచాలా అంటే – వారి జీవిత లక్ష్యం స్పష్ట మైన కొద్దీ వాళ్ళే – ఈ డిస్త్ట్రాక్షణ్ ల  నష్టం గుర్తించి  వారిని వారు నియంత్రించు కోగలుగుతారని అనుకోవాలి. దానికి పెద్దవాళ్ళు సహాయ పడాలి. అలా జరిగిన్నాడు పిల్లలు ఏదో కోల్పోతున్నామని వాపోరు, రెట్టించిన ఉత్సాహం తో తమ పేషన్ లో మునిగితేలుతారు. దానికి నాగేష్ కూకునూర్ తీసిన ‘ఇక్బాల్’ ఒక మంచి ఉదాహరణ. ఆ కుర్రాడికి తన ఆట మీద ఎంత మమకారం అంటే దాని కోసం చెయ్యాల్సిన త్యాగం త్యాగంలా అనిపించదు. విషయమేమిటంటే, గొప్ప పోటీల్లో నెగ్గడానికే కాదు, తమకు జన్మతః వచ్చిన శక్తులను వెలికితీసుకుని సార్ధకమైన జీవితం గడపాలంటే కూడా ప్రతీ ఒక్కరికీ క్రమబద్ధమైన జీవనం అవసరం. అది తెలియని దెవరికీ అనకండి. అసలు ఆ దుష్ఫలితాలను మనం ఏకగ్రీవంగా ఒప్పుకున్నదెక్కడ ఇంతదాకా, చర్చించిందెక్కడ? ఇన్నాళ్ళకి  పిల్లల మనసు మీద ప్రభావం చూపే అంశాలున్నాయని ఒక మెయిన్ స్ట్రీ మ్ కమర్షియల్ సినిమాలో కనీసం చూపించనైనా చూపించారు.అదీ నా పాయింట్.

* గీత నేషనల్ చాంపియన్ అయ్యాక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరుతుంది. అప్పటివరకూ తపస్సులా చేసిన పరిశ్రమ ఒక వృత్తిధర్మంలా మారిపోతుంది. దాని ఫలితంగా క్రమశిక్షణా, ఏకాగ్రతా, నిబద్ధతా తగ్గుతుంది. ఆమెలో వచ్చిన తేడా, దాని వల్ల జరిగే నష్టం – స్పష్టంగా ఆమె ఆటలో కనబడుతుంది. ఇదంతా మనకు ఒక వాక్యంలో వ్యక్తమౌతుంది. గీతని  “నీకోసం గోల్డ్ సంపాదించు కోవడం కాదు, దేశానికి గోల్డ్ తేవాలి” అంటాడు తండ్రి.

‘నీకోసం’ అంటే నేషనల్ లెవెల్, ‘దేశం కోసం’ అంటే ఇంటర్ నేషనల్ లెవెల్ అని అర్ధం చెప్పుకోవచ్చు. దీన్ని కొద్దిగా విస్తృతమైన పరిధిలో అర్ధం చేసుకోవాలనిపించింది. సర్వ సాధారణంగా ఆటల్లోకి వెళ్లి కొద్దిగా సక్సెస్ చవి చూసి, నేషనల్ లెవెల్ అనిపించుకున్నాక – కొంచెం పేరూ, ఒక ఉద్యోగం రాగానే – మన ఆటగాళ్ళ జీవిత వైఖరి మారిపోతుంది. దాన్ని ఇంకాస్త పొడిగిస్తే – గాయకులకి పాట మీద శ్రద్ధా, టీచర్లకి విద్య మీద శ్రద్ధా, రచయితలకి రచన మీద శ్రద్ధా, శాస్త్ర వేత్తలకి సైన్సు పట్ల శ్రద్ధా, వైద్యులకి తమ వృత్తి మీద శ్రద్ధా – ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రతీ రంగం లోనూ – జీవితంలో కాస్త పైకెదగడానికి అప్పటి దాకా  తమ ‘పని’ మీద పెట్టిన శ్రద్ధ – కొంచెం పేరొచ్చాక  మరి మాయం అయిపోతుంది.

దేశం కోసం ఆడగలగడం అన్న అంతర్జాతీయ ‘స్థాయి’ కావాలంటే – తమ ‘పని’   మీద మక్కువ ఉంటేనే సాధ్యం. డబ్బు కోసం, తన సౌకర్యవంతమైన జీవితం కోసం – అంత వరకూ ముళ్ళ మీదున్నట్టు కష్టపడిన వ్యక్తి, అవి కాస్తా దొరగ్గానే – కాళ్ళు జాపేసి చతికిలబడి పోడా!  సహజమే కదా, అందులో వింతేముంది?
అలా కాక తన వ్యక్తిగత విజయాల కంటే, తన స్వంత లాభనష్టాల కంటే – తన ‘పని’ లో తనకున్న ధ్యాసమగ్నత మనిషికి చోదకమయి, అతనిని నడిపితేనే – నాణ్యమైన ‘సరుకు’ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి కళారంగంలో  కావచ్చు, క్రీడారంగంలో కావచ్చు, వైజ్ఞానిక ఆవిష్కరణ కావచ్చు.

*సరే, గీతలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభా, ఏకాగ్రతా ఏర్పడ్డాయి. దానికి కోచ్ కాక తండ్రే కారణం అయ్యాడు.

ఎందుకలా? పిల్లల్ని అతి సన్నిహితంగా గమనిస్తూ, వారి ప్రత్యేకతలను గుర్తించి వారి అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చే గురువు కాబట్టి. కలగూర గంపలాగా అందర్నీ ఒకే గాట్న కట్టి, సక్సెస్ ఫుల్ అనిపించుకోవడమే ధ్యేయంగా పనిచేసే ‘కార్పోరేట్ ట్రెయినర్’ లకి  వారి విద్యార్ధులు ఒక ‘నెంబర్’ మాత్రమే. ఎంత మందిని తయారుచేస్తే అంతగొప్ప. ఆ రంధిలో వాళ్లకి వాళ్ళ థియరీలూ, కెరీర్లూ ముఖ్యం అవుతాయి కానీ పిల్లల మధ్య ఉండే సున్నితమైన తేడాలు గుర్తెరిగి దానిని బట్టి తమ బోధనా పద్ధతులు మార్చుకునే ఓపిక ఎక్కడ?

కనక  పర్సనలైస్డ్ గైడెన్స్ – అది తల్లి తండ్రులో, టీచరో, ఆత్మీయులో ఎవరి నుంచైనా గానీ – పిల్లలకి దొరకడం అవసరం. మళ్ళీ ఇక్బాల్ ఉదాహరణ తీసుకుంటే – అందులో కుర్రాడికి కోచ్ నసీరుద్దీన్ షా నుంచి ఆ గైడెన్స్ దొరుకుతుంది.

*అంతా జరిగాక  – ఆఖరి పోటీలో గీత తండ్రి మాట సహాయం లేకుండా ఒంటరిగా పోరాడుతుంది.

పిల్లలకి వారి గురువు మీద ఎంత నమ్మకముండాలో, అంత నమ్మకమూ తమకు అందిన శిక్షణ మీద ఉండాలి. అంతకంటే ఎక్కువ తమ మీద తమకి, తమ స్వయంశక్తి మీదా ఉండాలి. ఆ శిక్షణకి సాఫల్యం అదే కదా, విజయం పొందడం పొందలేక పోవడం నిర్ణాయకం కాదు. తామంతట తాము చెయ్యగలగడం, భవిష్యత్తులో మరొకరికి నేర్పగలగడం, అదే కదా విద్యకి పరమావధి.

_________________________________________________________

PS: మహావీర్ సింగ్, ఇద్దరు పిల్లలూ తప్ప మిగిలిన పాత్రలూ సన్నివేశాలూ అంతా కల్పితమేనని సినిమా మొదట్లోనే రాసారు. ప్రజాబాహుళ్యానికి నచ్చే రీతిలో కథ అల్లుకునే క్రమంలో వాస్తవాలకు సంబంధం లేదని నిర్మాతలు  వివరణ ఇచ్చారు. (ఉదా: పిల్లల తల్లీ, కోచ్ వంటి ముఖ్య పాత్రల విషయంలోనూ, మేచ్ స్కోర్ల విషయంలోనూ పూర్తి ఆర్టిస్టిక్ లిబర్టీ)

ఇంతింత అబద్ధాలా!

 

ప్రజల తలకాయల్తో ఆడుకోడమంటే ఏమిటనుకున్నారు
ఇదిగో ఇలాటి వార్తల్ని సృష్టించి
సోషల్ మీడియా లోకి వదలడం
ఇదే సమయం, జూలు విదిలించి
అబద్ధాలను అవతలకు తోసేయండి
మీకు తోచిన విషయాలను నిర్భయంగా నలుగురికీ అరిచి చెప్పండి
ఇలాటి వదంతులు మీదాకా వస్తే – అవి అబద్దాలని చెప్పడం మర్చిపోకండి
వీలయితే వాటిని వెటకారం చేసి చూడండి
భయపడుతున్న వారికి ధైర్యం చెప్పండి
ఈ దొంగ దెబ్బలని ఎదుర్కోడానికి సహకరించండి!

———————————————————-

😋😋😋
ఇదిగో ఇలాటివే ఆ వార్తలు

రాజకీయాలకు గానీ, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వాన్నీ ప్రధానమంత్రిని ఉద్దేశించి కానీ post లనూ వీడియోలనూ ఫార్వార్డ్ చేయరాదు. భారత పోలీసు దళం నోటిఫికేషన్ జారీ చేసింది – సైబర్ క్రయిం కింద మీ పై చర్య తీసుకోబడును.
డిలీట్ చెయ్యండి, మీ స్నేహితులతో కూడా చెప్పండి .😷.😤😤
రాజకీయ మత చర్చల పై రాయడం ఇప్పుడు నేరం, వారంటు కూడా లేకుండా అరెస్ట్ చేయబడుదురు.🙃🙃
అతి గంభీరమైన విషయం, అన్ని గ్రూపులకూ, వ్యక్తులకూ వర్తించగలదు. అడ్మిన్ లపై కఠిన చర్య తీసుకోబడగలదు.
మీ బంధు మిత్రులకూ, విదేశాల్లో ఉన్నవారికి కూడా తెలియబరచగలరు.😭😦😧
ఇది చాలా సీరియస్ విషయమని గ్రహించగలరు “🤑🤔😐🤓😣😑
___________________________________

ఒడుపంటే అది (ట)!

విజయా వాళ్ళ సినీమాల పేరెత్తితేది ప్రశంసించడానికే తప్ప మరెందుకూ కాదు … ఔను, నాకూ ఇష్టమే! ఎన్నోగంటలు … (తప్పు తప్పు) వందల గంటల ఎంటర్ టైన్ మెంట్ … పొందేం… అయినా సరే …

ఒడుపు
ఒడుపు

జగదేక వీరుని కథ – పేరే చెపుతుంది జానపద చిత్రమని.

ఒక వీరుడూ అతని భార్యలు నలుగురూ – సరే ఒక వాక్యంలో కథ కూడా చెప్తుంది ఫాంటసీ అని. అందుకే దానిలో మనుషులు రాళ్లయి పోతారా, ఒకరు నాలుగు రూపాల్లో మారగలరా అనే ప్రశ్నలు వేసుకోకుండా బుద్ధిగా అందులోని హాస్యాన్నీ, పరమాద్భుతమైన సంగీతాన్నీఆస్వాదించడానికి (వెయ్యో సారి) సిద్ధం అయ్యాను.

కథని  టూకీగా కూడా ఎవ్వరికీ చెప్పే సాహసం చెయ్యను. తెలియని వాళ్ళుంటారనుకోను. ఒకవేళ ఎవరికైనా తెలియకున్నా మరేం పర్వాలేదు.

తన వదినగారికి రక్షణగా ఉంటాడు రేలంగి. ఆమెను వంచించేటందుకు దుష్ట రాజూ, అతని కుటిల మంత్రీ ఆడవేషాల్లో వస్తారు. రేలంగి వారి దురూహ తెలుసుకుని … వారికి ‘తగిన విధం’గా శాస్తి చెయ్యాలనుకుంటాడు.

ఆ ప్రయత్నంలో రాజభటుల్నిద్దరిని పూటుగా తాగి రమ్మని చెప్తాడు. ఇదుగో ఆ సంభాషణ:

రేలంగి: ఏరా బాగా పుచ్చుకున్నారా?

ఒక భటుడు: పీకల దాకా పుచ్చుకున్నామయ్యా! ఏరా నీకెట్టా ఉంది?

రెండో భటుడు: సొరగం లో సొరగం రా, ఇపుడో పిల్ల … పిల్ల దొరికితే నా సామీ రంగా!  

రేలంగి: ఒరేయ్ ఇప్పుడిక్కడికీ ఇద్దరు కొత్త దాసీ లొచ్చారు (బాగా బలంగా ఉండే వాళ్ళని …  మోచేతుల్నిఎత్తి ఊపుతూ సూచిస్తాడు) చూసేరా?

భటులు: చూసేమయ్యా,

రేలంగి: చూసేరుగా … ఊ … వెళ్ళేటప్పుడూ వాళ్ళిద్దరినీ చెరోళూ లంకించుకోండి.

వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై అతని కాళ్ళ మీద పడతారు … ఆ కానీండి కానీండి … అంటూ రేలంగి నిష్క్రమిస్తాడు. ఈ ‘హాస్యం’ ఇంతటితో పూర్తి కాదు. ఇంకా ఉంది.

ఆడా కాదు మగా కాదు, మా లోకం లో పేడి వారన్న జాతి ఉన్నారంటూ ఒక విసురు తో ‘హాస్యం’ పండించేక వారిని బయటకి పంపిస్తాడు. బయట కాసుకుని ఉన్న భటులు ఆడ వేషంలో ఉన్న రాజూ, మంత్రిల …  మీద పడతారు. తాగి ఉన్నవారు వీరినే విధంగా బాధించి ఉంటారో ఊహించుకున్న వారికి ఊహించుకున్నంత ‘హాస్యం’!

ఇంతటితో అయిపోయిందనుకున్నారా? అమ్మమ్మ!  అసలు విషయం ఇక్కడే ఉంది. అది విన్నది విన్నట్టూ రాస్తాను. ఎంత రసవత్తరమైన హాస్యమో మీరే తేల్చుకోండి.

రాజు: ప్రగ్గడా, తెలిసిపోయింది. ఇక ఈ చచ్చు సరసాలెందుకు? ఆడదాన్ని చేపట్టే ఒడుపు తెలిసిపోయింది.

మంత్రి: అదెప్పుడు తెలిసింది రాజన్?

రాజు: అదే ఆ భటుడు మా జబ్బ పట్టుకున్నపుడు. మేం మగవాళ్ళం అయ్యాం గనక సరిపోయింది గానీ అదే ఆడ దాన్నయ్యుంటే ఆ పట్టుకు ఆట్టే లొంగి పోయేదాన్ని. ఒడుపంటే అది. నీకు తెలీలేదు.

మంత్రి: ఆ … నాకు తెలీలేదంటే నన్ను పట్టుకున్నవాడు ఒట్టి చచ్చు వెంకయ్య!

రాజు: హహహ!

దీని గురించి ఏ వ్యాఖ్యానమూ చెయ్య దల్చుకోలేదు. ఒక్కొక్క తప్పునూ ఎత్తి చూపి రాసి మీ వివేకాన్ని అవమానించ దలుచుకోలేదు. నేను చెప్పకపోయినా మీకు దానిలోని లోపాలన్నీ తెలుస్తూనే ఉండి ఉంటాయి. మరి దేనికి ఇదంతా వివరంగా రాసేనంటారా? కారణముంది.

ఎప్పుడో 1961లో వాళ్ళ ఆలోచనలు అంతే ఉండేవి, ఆ చిత్రాల్లో ఉన్న ‘కళ’ను ఆస్వాదించడమే గానీ ఈనాటి దృష్టితో వాటిని శల్య పరీక్ష చెయ్యకూడదు అని కొందరంటారు. నాకు తెలుసు.

వారికి నేను చెప్పేది ఒకటే! ఈ తప్పుల్ని తప్పులూ అని గుర్తించి పోరాడేం గనకనే అలాటి సంభాషణలు ఈనాడు అంత ఓపెన్ గా మనకు వినపడడం లేదు (కనీసం సినీమాల్లో). లేకపోతె ఈనాటికీ బలత్కారాన్ని శిక్షగా విధించడం, ఆ ప్రయత్నాన్ని చూసి నవ్వుకోవడం, తాగించి ఉసిగొల్పడం, జెండర్ ని అవమానం చెయ్యడం, బలవంతం చేసేవాడి ఒడుపును చూసి ఆడవాళ్ళు మురిసి పోతారనుకోడం  … ఇంకా అంత విచ్చలవిడి గానూ జరుగుతాయి.

మళ్ళీ మాట్లాడితే … అవి తప్పు అని చెప్పడానికి కూడా మనం భయ పడాల్సి రావచ్చును.

అందుకే శివశంకరీ పాటతో తన్మయురాలి నైనా, మరేవేవో మధుర స్మృతులు ఆ సినీమాతో  ముడి పడి ఉన్నా …తప్పును తప్పూ అని వేలెత్తి చూపించాల్సిందే. లేదంటే ఎప్పుడు అడుగు వెనక్కి పడి పోతుందో ఎవరూ చెప్పలేరు.

… … … తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు అని సుమతీశతక కారుడు చెప్పినా నేను మాత్రం ఆ పని చెయ్యదల్చుకోలేదు.