అందరూ ‘దంగల్ ‘ చేయించే తండ్రులవ్వచ్చా?

పోటీలకోసం కాదు, పిల్లల పురోభివృద్ది కోణంలో ఆలోచిద్దాం.

దంగల్ సినీమా ముఖ్యోద్దేశం – క్రీడల పట్ల అనురక్తీ, దేశం కోసం ఆడాలన్నపట్టుదలా, దీక్షా దక్షతల సాఫల్యం – ఇలాటి భావాల్లో ఏదో ఒకటి గానో లేకపోతే అన్నీఅనో చాలా మంది రాసేరు. ఆ విషయాలతో అస్సలు సంబంధం లేని ప్రశ్నల్ని చర్చించాలని ఉంది. ఇంకో సినీమా ఏదీ రేకెత్తించని ప్రశ్నల్ని అది నాలో లేవనెత్తింది. ఒక్కో  *అంశం చెప్పి దానిపై నా స్పందన చెప్తాను. ఆ క్రమంలో అభినందించాల్సిన అంశాలూ, సవరించుకుంటే బాగుండుననిపించిన అంశాలూ ప్రస్తావనకు వస్తాయి కనక వాటిని సావధానంగా పరిశీలించమని నా మనవి.

ముందుగా సినీమాలో పదిమందీ ఒప్పుకున్న ఘనత ఏమిటో టూకీగా ఓమాట చెప్పుకుందాం.

*కుస్తీల్లో నేషనల్ లెవెల్ ఆటగాడు మహావీర్ సింగ్ పోగట్. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించినా – జీవిక కోసం ఉద్యోగం చెయ్యక తప్పదు కనక జీవితంతో రాజీ పడి కుస్తీకి దూరమౌతాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పతకం తేవాలన్న తన కోరికని తనకు పుట్టబోయే కొడుకు తీరుస్తాడని కలలు కంటూ ఉంటాడు. కొడుకు పుట్టడు కానీ ఆ క్రమంలో నలుగురు కూతుళ్ళకు తండ్రి ఔతాడు. పెద్ద కూతుళ్ళు గీత, బబిత ఇద్దరిలోనూ కుస్తీ చెయ్యగల నేర్పు ఉన్నదని తెలుసుకుంటాడు. ఆ నమ్మకంతో కృషి చేస్తాడు. 

హర్యానా రాష్ట్రం గానీ, కుస్తీ ఆట గానీ మగాళ్ళ ప్రాబల్యం బలంగా ఉన్న జాగాలు. అక్కడ, అదీ ఓ పల్లెటూరిలో, ఒక మధ్య తరగతి తండ్రి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ తన నలుగురు ఆడపిల్లలకీ పెళ్ళిళ్ళు చేసి సాగనంపెయ్యాలనుకోకుండా – వారిలో ఒక ప్రతిభ ఉందని గుర్తించడం, వారిని గురించి ఒక ‘కల’ కనగలగడం, దాని కోసం పరిశ్రమించాలని అనుకోవడం – ఇవన్నీ- జయాపజయాలతో సంబంధం లేకుండా – చాలా సంతొషించదగ్గ విషయాలు. సరే, కామన్ వెల్త్ లో అమ్మాయి గీత  గోల్డ్ నిజంగా గెలిచింది  కాబట్టి సినీమా కథగా మారింది కానీ మన చర్చకి దానితో సంబంధం ఉండనక్కరలేదు. ఎందుకంటే – ‘పిల్ల లందరికీ’ సంబంధించే విషయం ఏదన్నా ఉందా అని మాట్లాడుకోవాలని నా ప్రయత్నం.

*ప్రతీ రోజూ పిల్లలిద్దర్నీ చీకట్నే లేపి ఎన్నో గంటల వ్యాయామం చేయించి, వాళ్ళు వేసుకునే దుస్తుల్లోనూ, వాళ్ళు తినే తిండిలోనూ జోక్యం చేసుకుని, చివరికి వాళ్ళ జుట్టును కూడా కత్తిరింపించి వాళ్లను అందరు ఆడపిల్లల కంటే భిన్నంగా పెంచుతాడు. తోటి పిల్లలతో వినోదాలకు కూడా దూరం చేసి వాళ్ళను పహిల్వానులను  చేస్తాడు.  

అంత చిన్న పిల్లల్ని ఏ అధికారంతో కుస్తీలు పట్టాలని శాసించాడు ఆ తండ్రి, అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. జవాబుగా వారికి మంచి భవిష్యత్తు రూపొందించాడు కదా అనొచ్చు. అలా చూస్తె ఐఐటి కోచింగ్లంటూ పిల్లల్ని ముక్కూ మూతీ కట్టి టెక్నోస్కూళ్ళ నూతుల్లో తోసేస్తున్న తల్లిదండ్రులంతా ఆ అమీర్ ఖాన్లే అనుకోవాలి, మరి పాపం వాళ్ళ ‘బంగారు’ భవిష్యత్తు కోసమేగా వాళ్ళను ఆ కష్టాలు పెట్టేది. మరి పిల్లల విషయంలో లోకంలో జరుగుతున్నదంతా సమంజసమైనదేనా?

అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది ఇక్కడ – చాలా మౌలికమైన భేదం. అదేమిటంటే – పిల్లల్లో ఆ ‘ప్రత్యేకమైన’ ప్రతిభను చూసి దానికి దోహదం చెయ్యడానికి తన శక్తియుక్తుల్ని ధార పోసేడు ఆ తండ్రి. అంతే కానీ లక్షలమంది అదే నూతిలో పడుతున్నారు గనక మేమూ మా పిల్లల్ని ఆ నూతిలోనే తోస్తాం అన్నమూర్ఖత్వం కాదు అది. సినీమాలో లోపం లేకపోలేదు. పిల్లలు – తమకు దొరికిన అవకాశం విలువను వాళ్ళే గుర్తించినట్టూ, వారి సమ్మతీ సహకారాలతో తండ్రి వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్టూ –  చిత్రీకరించి ఉంటే బాగుండేది, కానీ అది వేరే చర్చ.

కావాలని చెప్పేరో లేక అంత ఊహించలేదో తెలీదు గానీ – *క్రీడాకారులను బలహీన పరుస్తాయి అని అనుకునే అన్ని విషయాలనూ తన కూతుళ్ళకు నిషిద్ధం చేస్తాడు తండ్రి. ఆడతనం నిలుపు కోవడమో, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని దిశగా జీవితాన్ని నడుపుకోవడమో  ఏదో ఒకటే సాధ్యం అన్నట్టు చూపించారు.

ఆ లెక్కన ఈ అలంకరణలూ, ఆకర్షణ కోసం ఆరాటాలూ, జిహ్వ చాపల్యాలూ  – పిల్లల క్రియా శీలతనీ, పురోభివృద్ధినీ అడ్డుకుంటాయని ఒప్పుకున్నట్టే కదా. పెద్దయి జాలీగా గడపడం అనేదే తప్ప మరే లక్ష్యమూ లేకుండా పిల్లలు పెరుగుతున్నారన్నది అబద్ధం కాదు. అందులోనూ ఆడపిల్లలకి ఆడపిల్లలుగా కనిపించడం అనే అదనపు భారం  ఒకటి. సినీమా లోని ఈ కోణం చూసాక – అటువంటి  పై పై మెరుగుల మీద మోజు పెంచి, వారి మనసులను చిక్కుల్లో  ఇరికించి పిల్లల జీవితాలను నిర్వీర్యం చేస్తున్నామే అని అనిపించక మానదు.

కుస్తీ పట్టాలంటే కావాల్సిన నిగ్రహం, క్రమశిక్షణా మిగిలిన రంగాల్లో రాణించాలంటే అక్కరలేదా… తప్పకుండా కావాలి. తినే తిండి, పాల్గొనే వినోదాలూ, కోరుకునే కోరికలూ – అన్నిటి ప్రభావమూ పిల్లల అభివృద్ది మీద ఉంటుంది. వాటిని చక్కదిద్దకుండా పిల్లలకు లక్ష్యశుద్ధి ఏర్పడాలనే ఆశ నిరర్ధకం.

అలా అని పిల్లల్ని మిలిటరీలో పెట్టినట్టు పెంచాలా అంటే – వారి జీవిత లక్ష్యం స్పష్ట మైన కొద్దీ వాళ్ళే – ఈ డిస్త్ట్రాక్షణ్ ల  నష్టం గుర్తించి  వారిని వారు నియంత్రించు కోగలుగుతారని అనుకోవాలి. దానికి పెద్దవాళ్ళు సహాయ పడాలి. అలా జరిగిన్నాడు పిల్లలు ఏదో కోల్పోతున్నామని వాపోరు, రెట్టించిన ఉత్సాహం తో తమ పేషన్ లో మునిగితేలుతారు. దానికి నాగేష్ కూకునూర్ తీసిన ‘ఇక్బాల్’ ఒక మంచి ఉదాహరణ. ఆ కుర్రాడికి తన ఆట మీద ఎంత మమకారం అంటే దాని కోసం చెయ్యాల్సిన త్యాగం త్యాగంలా అనిపించదు. విషయమేమిటంటే, గొప్ప పోటీల్లో నెగ్గడానికే కాదు, తమకు జన్మతః వచ్చిన శక్తులను వెలికితీసుకుని సార్ధకమైన జీవితం గడపాలంటే కూడా ప్రతీ ఒక్కరికీ క్రమబద్ధమైన జీవనం అవసరం. అది తెలియని దెవరికీ అనకండి. అసలు ఆ దుష్ఫలితాలను మనం ఏకగ్రీవంగా ఒప్పుకున్నదెక్కడ ఇంతదాకా, చర్చించిందెక్కడ? ఇన్నాళ్ళకి  పిల్లల మనసు మీద ప్రభావం చూపే అంశాలున్నాయని ఒక మెయిన్ స్ట్రీ మ్ కమర్షియల్ సినిమాలో కనీసం చూపించనైనా చూపించారు.అదీ నా పాయింట్.

* గీత నేషనల్ చాంపియన్ అయ్యాక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరుతుంది. అప్పటివరకూ తపస్సులా చేసిన పరిశ్రమ ఒక వృత్తిధర్మంలా మారిపోతుంది. దాని ఫలితంగా క్రమశిక్షణా, ఏకాగ్రతా, నిబద్ధతా తగ్గుతుంది. ఆమెలో వచ్చిన తేడా, దాని వల్ల జరిగే నష్టం – స్పష్టంగా ఆమె ఆటలో కనబడుతుంది. ఇదంతా మనకు ఒక వాక్యంలో వ్యక్తమౌతుంది. గీతని  “నీకోసం గోల్డ్ సంపాదించు కోవడం కాదు, దేశానికి గోల్డ్ తేవాలి” అంటాడు తండ్రి.

‘నీకోసం’ అంటే నేషనల్ లెవెల్, ‘దేశం కోసం’ అంటే ఇంటర్ నేషనల్ లెవెల్ అని అర్ధం చెప్పుకోవచ్చు. దీన్ని కొద్దిగా విస్తృతమైన పరిధిలో అర్ధం చేసుకోవాలనిపించింది. సర్వ సాధారణంగా ఆటల్లోకి వెళ్లి కొద్దిగా సక్సెస్ చవి చూసి, నేషనల్ లెవెల్ అనిపించుకున్నాక – కొంచెం పేరూ, ఒక ఉద్యోగం రాగానే – మన ఆటగాళ్ళ జీవిత వైఖరి మారిపోతుంది. దాన్ని ఇంకాస్త పొడిగిస్తే – గాయకులకి పాట మీద శ్రద్ధా, టీచర్లకి విద్య మీద శ్రద్ధా, రచయితలకి రచన మీద శ్రద్ధా, శాస్త్ర వేత్తలకి సైన్సు పట్ల శ్రద్ధా, వైద్యులకి తమ వృత్తి మీద శ్రద్ధా – ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రతీ రంగం లోనూ – జీవితంలో కాస్త పైకెదగడానికి అప్పటి దాకా  తమ ‘పని’ మీద పెట్టిన శ్రద్ధ – కొంచెం పేరొచ్చాక  మరి మాయం అయిపోతుంది.

దేశం కోసం ఆడగలగడం అన్న అంతర్జాతీయ ‘స్థాయి’ కావాలంటే – తమ ‘పని’   మీద మక్కువ ఉంటేనే సాధ్యం. డబ్బు కోసం, తన సౌకర్యవంతమైన జీవితం కోసం – అంత వరకూ ముళ్ళ మీదున్నట్టు కష్టపడిన వ్యక్తి, అవి కాస్తా దొరగ్గానే – కాళ్ళు జాపేసి చతికిలబడి పోడా!  సహజమే కదా, అందులో వింతేముంది?
అలా కాక తన వ్యక్తిగత విజయాల కంటే, తన స్వంత లాభనష్టాల కంటే – తన ‘పని’ లో తనకున్న ధ్యాసమగ్నత మనిషికి చోదకమయి, అతనిని నడిపితేనే – నాణ్యమైన ‘సరుకు’ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి కళారంగంలో  కావచ్చు, క్రీడారంగంలో కావచ్చు, వైజ్ఞానిక ఆవిష్కరణ కావచ్చు.

*సరే, గీతలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభా, ఏకాగ్రతా ఏర్పడ్డాయి. దానికి కోచ్ కాక తండ్రే కారణం అయ్యాడు.

ఎందుకలా? పిల్లల్ని అతి సన్నిహితంగా గమనిస్తూ, వారి ప్రత్యేకతలను గుర్తించి వారి అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చే గురువు కాబట్టి. కలగూర గంపలాగా అందర్నీ ఒకే గాట్న కట్టి, సక్సెస్ ఫుల్ అనిపించుకోవడమే ధ్యేయంగా పనిచేసే ‘కార్పోరేట్ ట్రెయినర్’ లకి  వారి విద్యార్ధులు ఒక ‘నెంబర్’ మాత్రమే. ఎంత మందిని తయారుచేస్తే అంతగొప్ప. ఆ రంధిలో వాళ్లకి వాళ్ళ థియరీలూ, కెరీర్లూ ముఖ్యం అవుతాయి కానీ పిల్లల మధ్య ఉండే సున్నితమైన తేడాలు గుర్తెరిగి దానిని బట్టి తమ బోధనా పద్ధతులు మార్చుకునే ఓపిక ఎక్కడ?

కనక  పర్సనలైస్డ్ గైడెన్స్ – అది తల్లి తండ్రులో, టీచరో, ఆత్మీయులో ఎవరి నుంచైనా గానీ – పిల్లలకి దొరకడం అవసరం. మళ్ళీ ఇక్బాల్ ఉదాహరణ తీసుకుంటే – అందులో కుర్రాడికి కోచ్ నసీరుద్దీన్ షా నుంచి ఆ గైడెన్స్ దొరుకుతుంది.

*అంతా జరిగాక  – ఆఖరి పోటీలో గీత తండ్రి మాట సహాయం లేకుండా ఒంటరిగా పోరాడుతుంది.

పిల్లలకి వారి గురువు మీద ఎంత నమ్మకముండాలో, అంత నమ్మకమూ తమకు అందిన శిక్షణ మీద ఉండాలి. అంతకంటే ఎక్కువ తమ మీద తమకి, తమ స్వయంశక్తి మీదా ఉండాలి. ఆ శిక్షణకి సాఫల్యం అదే కదా, విజయం పొందడం పొందలేక పోవడం నిర్ణాయకం కాదు. తామంతట తాము చెయ్యగలగడం, భవిష్యత్తులో మరొకరికి నేర్పగలగడం, అదే కదా విద్యకి పరమావధి.

_________________________________________________________

PS: మహావీర్ సింగ్, ఇద్దరు పిల్లలూ తప్ప మిగిలిన పాత్రలూ సన్నివేశాలూ అంతా కల్పితమేనని సినిమా మొదట్లోనే రాసారు. ప్రజాబాహుళ్యానికి నచ్చే రీతిలో కథ అల్లుకునే క్రమంలో వాస్తవాలకు సంబంధం లేదని నిర్మాతలు  వివరణ ఇచ్చారు. (ఉదా: పిల్లల తల్లీ, కోచ్ వంటి ముఖ్య పాత్రల విషయంలోనూ, మేచ్ స్కోర్ల విషయంలోనూ పూర్తి ఆర్టిస్టిక్ లిబర్టీ)