రాజుల/నాయకుల నిజాలు

బాహుబలి సినీమా చూసేను. ఆ సినీమా కథా, టేకింగూ, కళా, విలువలూ – ఈ మంచీ చెడ్డా జోలికస్సలు పోను.  ఈ పోస్ట్ సినిమా గురించి కాదు – సినిమాలో బయటపడ్డ వాటి గురించి.  నాకు ఆ సినిమాలో కనిపించిన అంశాలు … ఆ సినిమా తయారీ దారులు ఉద్దేశించినవి కానే కాదు, నూటికి నూరు శాతమూ కాదు.

సినిమా అభిమానులు/ ఔత్సాహికులు – ఎవరైనా చదవబోతున్నారేమో, కంగారు పడకండి. నేను కథకి సంబంధించిన సస్పెన్సును బయటపెట్టే పనులేం చెయ్యబోను. ప్రశాంతంగా చదవొచ్చు మీరు.

రాజుల బలం –  అతని వీరత్వం మీదా లేక అతని దగ్గరున్న వీరుల శౌర్య సాహసాల మీదా ఆధారపడి ఉంటుందని మనకు కథలు చెప్తూ ఉంటారు. ఆ రాజ్యపు సహజసంపదల మీదా, రక్షణల మీదా, కాపలాల మీదా ఉందని చెప్తారు. వేగుల వాళ్ల సమాచారాల మీదా, మంత్రుల తెలివి తేటల మీదా, దూతల చాకచక్యం మీదా రాజకీయపు టెత్తుల మీదా ఆధార పడుతుందంటారు.  చివరికి చారులూ, రాజనర్తకి, గాయకులూ, కవులూ, విదూషకులూ, పురోహితులూ కూడా ఆ జాబితాలో భాగమే. అందరూ –  అడపా దడపా వచ్చిన ఆపదల్లోంచి తమ శక్తి యుక్తులనుపయోగించి తమ రాజ్యాలని అమాంతం గట్టెక్కించిన వైనాలు … చిన్నప్పట్నుంచీ వింటూ ఉంటాం. ఆ కథలు విశ్వ సాహిత్యం లో కూడా కోకొల్లలు. అవి ఎంతో కొంత మేరకు నిజమూ కావచ్చు – ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో! వాటిని తర్కించే అవసరం లేదు. మన మనోల్లాసానికి ఎన్ని కథలన్నా చెప్పుకోవొచ్చు.

అయితే అలాటి కథలన్నిటికీ ఉమ్మడి అంశం ఒకటి – ఆహా, రాజు గారికి ఇలాటి వాడొక్కడుంటే …ఇంకేం అక్కర్లేదు అనిపించడం.

కానీ కొంచెం రీజనింగుండి, తగు మాత్రం ప్రజల ఎమోషన్లతో పరిచయం ఉన్నవాడెవడైనా – టక్కున చెప్పగలడు. రాజులు కావాలి కావాలని  ఆశపడేదిీ, అర్రులు చాచేదీ – ప్రజాదరణ కోసమేనని.  సరే దానిని పొందడం కోసం ప్రజలకు మేలు కలిగే పనులు చేసి, వారి అభిమానం పొందాలని అనుకునేంత వెర్రి రాజులుంటారా, ఉండరు. ఒక వేళ ఉంటే, గింటే ఏం జరుగుతుందంటే, ఏ ధనవంతుల కోసం అసలు రాజ్యం ఏర్పడిందో వాళ్లు ఆ రాజు చెవి మెలేసి బుద్ధి చెప్తారు, లేకపోతే అవతలికి పొమ్మంటారు. అసలలాటి అవసరం ఇన్ని శతాబ్దాల్లో ఒక్క సారైనా వచ్చి ఉంటుందో లేదో … మరి నాకు తెలీదు.

సరే! ప్రజల చేత జేజేలు ఎలా  కొట్టించు కోవాలి?  వారిలో పరపతి ఎలా పెంచుకోవాలి? మరి అప్పుడే కదా తమ అధికారం సుస్థిరం అయ్యేది,  ఆ స్థానం ఎలా దక్కించుకోడం? అదే కదా అందరు నాయకుల తాపత్రయమూనూ! రాజ్యతంత్రమంటే ఏమిటయ్యా అంటే … ఏ మేజిక్కో గిమ్మిక్కో చేసి ప్రజలని మైమరిపించడం. అందుకే క్రతువు లండం, యజ్ఞాలండం, పూజలండం, బలులండం – ఇవన్నీ రాజ్యం సుభిక్షంగా ఉండడానికే చేస్తున్నామనడం.    baahubali-2-stills-photos-pictures-262
“మాకు ప్రజల క్షేమమే ముఖ్యం. మీ కోసం రాణీ గారు చూడండి … పాపం…  ఒట్టి కాళ్లతో నెత్తి మీద నిప్పుల్తో అంత దూరం సంవత్సరానికోసారి నడిచి వచ్చి కరువు రాక్షసిని కాల్చేస్తోందం”టే …( బొత్తి గా సినిమానొదిలేసి రాస్తున్నాననుకోకండి మరి ) ప్రజల్లో ఎలాటి సెంటిమెంటు లేస్తుంది? వాళ్ళ మనసులుప్పొంగి పోవా!!!  – అదీ టెక్నిక్. అది వాల్మీకికీ తెలుసు, వ్యాసుడికీ తెలుసు … మొన్న మొన్నటి చాణుక్యుడికీ తెలుసు. దేశకాలాలను దాటి వచ్చిన తెలివి అది.  గురజాడ కన్యాశుల్కంలో రాస్తాడు  – ‘సీవఁరాణి బీద సాదలకి బట్టలు కుట్టి ఇస్తుంద’ని గిరీశం డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఊక దంపుడు గుర్తుంది కదా. ఇంగ్లండు నుండి ఇక్కడి దాకా పాకించి తెచ్చిన  కథల మహిమ తక్కువా!

అటు కైకేయికీ, ఇటు ధృతరాష్ట్రుడికీ ఆవరాసుకు పోయినట్టు మండడానికి కారణం ఏమిటి?

ప్రజలు రాముడి వైపో, ధర్మరాజు వైపో మొగ్గేరన్నది – కథకి ఇరుసు. అదే మేజర్ ప్లాటు. రాముడు వనవాసానికి పోతుంటే ప్రజలు భోరు మన్నారట. పాండవుల వెంట పడి అడవుల్లోకి పోయార్ట. “అయ్యలారా! అమ్మ లారా! వాడు రాజైతే   మన కెందుకు? వీడు రాజైతే మన కేమిటి? ఏ రాయైతేనేం పళ్లూడగొట్టు కోడానికి? మనకి  కావలసిన కూడూ గూడూ మనకు దక్కేట్టు చూసుకోడం ముఖ్యం  కదర్రా ” అని మీలాటి నాలాటి వాళ్లు ఆ అమాయకులికి చెబ్దామన్నా ….ఇప్పుడూ వినడం లేదు, అప్పుడూ వినుండే వారు కాదు. ఆ  సెంటిమెంట్  మాయాజాలం అలా ఉంటుంది మరి. దానిని ఛేదించి వాళ్ళ దాకా నిజాన్ని పట్టికెళ్ళడం – అదేం తేలికకాదు.      aaeaaqaaaaaaaaymaaaajge5zgq5zdaylwrjodetndjjni1iowrhlwmwotninweymzjhna

భారతీయ సాహిత్యమే కాదు,  ప్రపంచంలోని ఏ సాహిత్యం తీసుకున్నా ఇదే సత్యం బయటపడుతుంది. అంతెందుకు ఏసుక్రీస్తును రోమన్ రాజులు చంపించింది అతనికి పెరిగి పోతున్న ప్రజాదరణని చూసే కదా. తర్వాత కాలంలో మేకవిల్లీని అపర చాణక్యుడని చెప్పొచ్చు. అతను రాజులకి చిట్కాలుచెప్తూ ప్రిన్స్ అని పుస్తకం రాసేడు. దాని నిండా ఇవే … ఎలా అసలు పని చెయ్యకుండా చేసినట్టు కనిపిస్తూ ప్రజల మెప్పు పొందాలో … ఆ జిత్తులన్నీ నేర్పుతాడు.

అనుకోకుండా సినిమాలో  బయట పడిన మరొ పదహారణాల సత్యం – రాజుల్ని రాజ భవనాల్లోంచి బయటకి లాగి సామాన్యుల మధ్య బతికేటట్టు గనకా చేసామా – వాళ్ల భుజ బలాలూ, విద్యాభ్యాసాలూ … ఎలా ఉపయోగించాలో, ఎవరికి మేలు చెయ్యాలో … మహ చక్కగా బోధపడుతుందని!

భలే ముచ్చటేసింది లెండి ఆ ఆలోచనకే.

ప్రజాదరణ అంటే అంతటి విలువైన సరుకు. పోనీ దాని బలం అర్ధమయ్యాకైనా … ప్రజల అభిమతానికి లొంగి ఉంటారా మరి ఈ రాజులు. అబ్బే, అదేం లేదు, దానిని ఎలా మేనిప్యులేట్ చెయ్యాలా అని తలలు పగల గొట్టుకుంటూ ఉంటారు. ఆ భాగ్యాన్ని దక్కించుకున్నవాడు పక్కలో బల్లెం లా కనిపిస్తాడు. అది ఫిడల్ కాస్ట్రో గానీ, సద్దాం హుస్సేన్ కానీ – వాడి వ్యక్తిగత గుణగణాలతో సంబంధం లేదు. వాడు ప్రజల్లో పాపులరా – అయితే దించేయ్ లేక పోతే చంపించేయ్. అదే పోలిటిక్స్ సారమంతా.

అది బహిరంగంగా  మాత్రం జరగకూడగదు, జరిగిందా – ప్రజలకి ఆగ్రహం వచ్చేస్తుంది. అంతర్యుద్ధం వచ్చేయ్యగలదు. మహర్షులూ, ఆచార్యులూ, మన సినిమాల్లో ధర్మపన్నాలు చెప్పే రాణీ గార్లూ  – అలాటి అత్యవసర పరిస్థితుల్లో …తూచ్ అనీ, టైం ప్లీస్ అనీ – బ్రేక్ తీసుకుంటారు. చిన్న చిన్న హత్యలు చేసో, చేయించో, (అదీ  రహస్యంగా  సుమా) –  వచ్చి  మళ్లీ రాజ్య రక్షణా  భారం వహిస్తారు.

మరి,  ‘ధర్మ పరిపాలన’  చెయ్యాలంటే, అసలు పరిపాలన అంటూ సాగాలా వద్దా?  దానికి సిద్ధంగా ప్రజలుంటేనే కదా పరిపాలన చేసేది ….

ఎంత బంగారం సింహాసనం అయినా అది రాజ్యాధికారానికే కదా చిహ్నం. అసలు ఆ అధికారం అన్నది ఉండాలంటే …  అమాయక ప్రజలకు కోపం రానంత సేపే. ఆ విషయం  రాజ్యం చేసే ప్రతీ వాడికీ వాడి అంతరాంతరాల్లో తెలుసు. –

 

తెలీనిది ప్రజలకి మాత్రమే.- అదీ కథ

 

 

 

 

Author: samanvayam

కొత్త విషయాన్నో, కొత్తగా కనిపించిందాన్నో - మీతో పంచుకోడానికి ... మీరేమంటారో వినడానికీ ... ఇక్కడ రాస్తూ ఉంటాను.

2 thoughts on “రాజుల/నాయకుల నిజాలు”

 1. చాలా సంక్లిష్టాంశాన్ని చాలా సులువుగా చెప్పారు. బాహుబలిని విమర్శించక పోయినా జనం నిరాశ చెందుతారు. నేను బాహుబలి మీద రెండో పోస్టులో విమర్శ తగ్గించినందుకు ఏమిటి ఇలా అయిపోయారు? అని అడిగారు.

  Liked by 1 person

  1. నిజమే … సరిగ్గా చెప్పేరు.
   సినీమా కంటే ముఖ్యమైన చర్చనీయాంశాలుంటాయంటే … ఒప్పుకోరేమో కూడానూ …

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: